Search

Wednesday, March 3, 2010

జ్ఞాపకం ...

పల్లవి:

వేకువై తడిమే వేడిలో నీ శ్వాసలో స్పర్శే జ్ఞాపకం ...
వెన్నెలై తడిపే కాంతిలో నీ కంటిలో చూపే జ్ఞాపకం ...
ఊహల్లో నీ జ్ఞాపకం ...
ఊపిరిలో నీ జ్ఞాపకం ...

చరణం-1:
ఏ గాధలో ఏ మలుపులో ఏ గూటికో చేర్చేలా చేస్తాయిగా ....
ఏ బాధలో కన్నీరులే సెలయేరులై పొంగేలా చేస్తాయిగా ...
గాలిలో తేలే మేఘమే కరిగిపోతుందనే తెలిసినా ...
నేలపై వాలే పావురమే ఎగిరిపోతుందనే తెలిసినా ...
ఊహల్లోనే మిగలనా ...

చరణం-2:
నాదన్నదే ఏముందని నా నీడకే ప్రతి రూపం అయ్యావుగా ...
నేనన్నదే మరిచేంతగా మధు వానలో తడిసేలా చేసావుగా ...
నన్నిలా వేధించావని నేరుగా చెప్పలేనే కాలమా ...
గొంతులో గరళమే దాచినా పైకలా నవ్వుతావేం హృదయమా ...
విడిపోకే నా ప్రాణమా ...

Tuesday, March 2, 2010

అద్వైతం

పల్లవి:

నా నీడై నువ్వుంటూ ... నీ తోడై నేనుంటూ ...
కలకాలం సాగుదామా ...
ఆనందంలోనైనా ... ఆవేదనలోనైనా ...
ఏదైనా సగమై ఉందామా...
మన గట్టులే దాటామా ...
మరి గుట్టుగా కలిశామా ...
ఈ ద్వైతమే అద్వైతం కాదా ...

చరణం-1:
ఆలాపనలో రాగంలా ... ఆకాశంలో మేఘంలా ...
ఆ సంద్రంలో అలలాగా ఎపుడూ ఉందామా...
చిరుగాలై ఎద సవ్వడికే నే ఊపిరవనా ...
కనుపాపై చుట్టూ ఉన్న లోకం చూడనా ...
అరె బుడుకలో నువ్వుంటే ...
మరి బుడుతడై నే రానా ...
నీ అడుగులో అడుగే కాలేనా ...

చరణం-2:
మన రక్తం ఎరుపేగా ... మన మనసులు తెలుపేగా ...
మరి ఎందుకో ఈ దూరం ...
ఏ దేహంలోనైనా ... కొలువై ప్రాణం లేదా ...
మన పుట్టుకలోనే దూరం దాగుందా ...
మరి ఇన్నినాళ్ళు దేవా ...
విధి జూదమే ఆడావా ...
ఈ ద్వైతమే ...





Monday, March 1, 2010

తొలి వలపు

పల్లవి:

కళ్ళల్లో కదిలే స్వప్నం .... గుండెల్లో రగిలే విరహం ....
అంతా నీవంటూ ఉంటే కాదనలేకున్నా ...
మదిలో నీ తియ్యని రూపం ... పదిలంగా ఉందనుకుంటే ...
ఎటు చూసిన నువ్వే కనబడి వేదన పడుతున్నా ...
కల అని నేనెంతగా చెప్పినా కాదని అంటుందే మనసు ...
నీవైపే పరుగులు తీసిందే ...

తొలి వలపే వికసించెనా ....
నను వీడకే ప్రియ నేస్తమా ...

చరణం 1:
చిగురించిన పెదవుల పైన ... చిరునవ్వుల వెన్నెల వాన ...
అంతా నాదనుకుంటూనే సంబర పడుతున్నా ...
చిలకలోని తియ్యదనాలను ... పిలుపులోని కమ్మదనాలను ...
అన్నీ నీలోనే చూసి ఆనందిస్తున్నా ...
అలలాగా ఎగసిపడే నా మనసునెలా ఓదార్చేదీ ....
జ్ఞాపకాల పల్లకిలో నీవే ...

తొలి వలపే వికసించెనా ....
నను వీడకే ప్రియ నేస్తమా ...

చరణం 2:
నీలాల గగనంలోన ... మేఘాల ముసుగుల్లోన ...
తళుకుమన్న తారవు నీవని నేననుకుంటున్నా ...
ఊహలనే ఊసుల్లోన ... ఊరేగే నీ ప్రియ భావన ...
ఊరించి వదిలేస్తావని ఆలోచిస్తున్నా ...
నా నిన్నే పొందాలని నేనెంతగ నాలో నిన్నే కోరినా ...
నా ముందుకు రావెందుకు నేస్తం ...

తొలి వలపే వికసించెనా ....
నను వీడకే ప్రియ నేస్తమా ...